ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక పర్యాటక కేంద్రమైన గండికోటను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం కడప జిల్లాలోని గండికోటలో నిర్వహించిన ‘ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంలోకి రూ.500 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షిస్తూ కీలక ఒప్పందాలు జరిగాయి.
భారతదేశ గ్రాండ్ కాన్యన్‌గా ప్రసిద్ధి చెందిన గండికోటను ఒక ప్రధాన ‘యాంకర్ హబ్’గా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ‘సాస్కీ’ పథకం కింద రూ.78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు వ్యూ పాయింట్, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్, కోట వద్ద ప్రత్యేక లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్టు వివరించారు. ఈ ఏడాది చివరికల్లా టెంట్ సిటీని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
