రైతుల ఖాతాల్లోకి రూ.7000: ‘అన్నదాత సుఖీభవ’కు చంద్రబాబు శ్రీకారం!

Picture of Victory Media Tv

Victory Media Tv

ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. సూపర్ సిక్స్ పథకాలలో అత్యంత ముఖ్యమైన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రకాశం జిల్లా, దర్శి మండలం, వీరాయపాలెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య రైతన్నలతో కలిసి ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి తొలి విడతగా రూ.7,000 చొప్పున నేరుగా జమ చేశారు.ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.5,000, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వాటాగా రూ.2,000 కలిపి మొత్తం రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఒక్క విడతలోనే రాష్ట్రంలోని రైతులకు రూ.3,175 కోట్ల మేర లబ్ధి చేకూరుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,343 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించిన చంద్రబాబు, దేశానికి అన్నం పెట్టే రైతుల మధ్య ఈ పథకాన్ని ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. “రైతుల కళ్లలో ఆనందాన్ని నేరుగా చూస్తున్నాను. ఎన్ని కష్టాలున్నా రైతులు బాగుండాలన్నదే నా కోరిక. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తుండటం చెప్పలేని సంతృప్తినిస్తోంది,” అని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తామని, ఏ పంట వేస్తే లాభాలు వస్తాయో అధ్యయనం చేసి సూచనలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Leave a Comment

Leave a Comment