పెరగనున్న ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీస్‌ ఛార్జీలు

Picture of Victory Media Tv

Victory Media Tv

హైదరాబాద్ నగర వాసులతో పాటు జిల్లా కేంద్రాలు..ముఖ్య పట్టణాల ప్రజల అవసరాలు తీర్చడంలో కీలకంగా మారిన ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీస్‌ల సేవలు ఇక మరింత ప్రియం కానున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓలా, ఉబర్, ర్యాపిడో ఛార్జీలు పెంచేందుకు అనుమతినివ్వడం హాట్ టాపిక్ గా మారింది.రద్దీ అవర్స్‌లో రెండు రెట్ల అధిక ధరలు వసూలు చేసేందుకు ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీస్ లకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈమేరకు మోటార్‌ వెహికిల్ అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. దీంతో క్యాబ్ సర్వీస్ ల ధరలు పెరిగిపోనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల ప్రజలు ఇటు అర్బన్ బస్ సర్వీసుల చార్జీలు..మెట్రో చార్జీలు పెరిగి ఇబ్బంది పడుతుండగా..తాజాగా ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీస్‌ల చార్జీలు కూడా పెరగనుండటం వారికి మరింత ఆర్థిక భారం కానుంది.
కొత్త నిబంధనల ప్రకారం నామమాత్రంగా రద్దీ ఉన్న సమయాల్లో బేస్‌ ఛార్జీల్లో సగం సర్‌ఛార్జీ కింద పెంచుకునేందుకు వీలు కల్పించింది. రద్దీ విపరీతంగా ఉంటే 200 శాతం పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అంతకుముందు ఈ వెలుసుబాటు 150 శాతంగా ఉండేది. ఇక, మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదన్న షరతు విధించింది. అదే సమయంలో, రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీ కంటే 50% తక్కువ ఛార్జీ వసూలు చేయవచ్చని పేర్కొంది.

యాప్‌ ద్వారా రైడ్‌ను అంగీకరించిన తర్వాత సరైన కారణం చెప్పకుండా డ్రైవర్ క్యాన్సిల్‌ చేస్తే.. ఛార్జీలో 10 శాతం పెనాల్టీ (రూ.100 మించకుండా) పడుతుంది. దానిని డ్రైవర్, అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌ (ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు) చెరి సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికులే సరైన కారణం చెప్పకుండా రైడ్ క్యాన్సిల్ చేసినా ఇదే పెనాల్టీ వర్తిస్తుంది. ఇక డ్రైవర్ పికప్‌పాయింట్‌కు చేరుకోవడానికి ప్రయాణించే దూరం అంటే డెడ్‌ మైలేజ్‌కు ఛార్జీ విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే పికప్ పాయింట్ మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పుడే ఈ మినహాయింపు వర్తిస్తుంది.అలాగే కేంద్రం డ్రైవర్ల, ప్రయాణికులు సంక్షేమానికి కూడా చర్యలు ప్రకటించింది. ఈ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లతో అనుబంధంగా ఉన్న ప్రతి డ్రైవర్‌కు కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల మేర టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను ఆ క్యాబ్‌ సంస్థలు తప్పనిసరిగా అందించాలని పేర్కొంది

Leave a Comment

Leave a Comment