ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో జనం అల్లాడుతుంటే, ఓ పోలీస్ అధికారి మాత్రం తన ఇంట్లోకి వచ్చిన వరద నీటిని సాక్షాత్తూ గంగా మాతగా భావించి పూజలు చేశారు. ఆయన భక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గంగా, యమునా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లోని దారాగంజ్ ప్రాంతానికి చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ చంద్రదీప్ నిషాద్ ఇంట్లోకి కూడా వరద నీరు వచ్చేసింది. అయితే, దీనికి ఆయన ఆందోళన చెందలేదు. పైగా తన ఇంటి గుమ్మం వద్ద నిలబడి వరద నీటికి భక్తితో పూజలు నిర్వహించారు.
“జై గంగా మయ్యా కీ… నన్ను ఆశీర్వదించడానికి నా ఇంటికే వచ్చావు. నేను ధన్యుడినయ్యాను” అంటూ మంత్రాలు పఠిస్తూ పాలు పోసి, గులాబీ రేకులను చల్లారు. వరద నీటిలో మునిగి, గంగమ్మకు నమస్కరించారు. అంతేకాకుండా నడుము లోతు నీరున్న తన ఇంట్లోనే ఈత కొడుతూ ‘జై గంగా మయ్యా’ అని నినదించారు. ఈ దృశ్యాలను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. హైకోర్టు జడ్జికి పీఎస్ఓగా పనిచేస్తున్న నిషాద్ జాతీయ స్థాయి స్విమ్మర్ కావడం గమనార్హం.
