ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్ (81) ఈ ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శిబు సోరెన్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ… శిబు సోరెన్ భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారని అన్నారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందని చెప్పారు. ఆయన మరణం కేవలం వ్యక్తిగత నష్టం కాదని… న్యాయం, గౌరవం, గుర్తింపు పట్ల అచంచలమైన నిబద్ధతతో ఏర్పడిన ఒక శకానికి ముగింపు అని అన్నారు.
