ఏపీలోని తిరుపతి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జైలు నుంచి పరారైన ఒక ఖైదీ ప్రియురాలి ఇంట్లో పోలీసులకు చిక్కాడు. కేవలం 24 గంటల్లోనే అతడిని పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే… నాగలాపురంకు చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తి గత నెల 20న దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం సత్యవేడు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిన్న ఉదయం శ్రీనివాసన్ జైలు నుంచి తప్పించుకుని, నాగలాపురంలో ఉన్న తన ప్రియురాలు ఇంటికి వెళ్లాడు.
మరోవైపు శ్రీనివాసన్ కనిపించకపోవడంతో జైలు అధికారులు అలర్ట్ అయ్యారు. అతని కోసం గాలింపు ప్రారంభించి, ప్రియురాలు ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకుని, సబ్ జైలుకు తరలించారు.
