ఆ ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్ వారే అని చెప్పేందుకు ఇవిగో ఆధారాలు!

Picture of Victory Media Tv

Victory Media Tv

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో జులై 28న జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్‌’లో ముగ్గురు లష్కర్-ఎ-తాయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల హత్యకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. ఫోరెన్సిక్, బాలిస్టిక్ ఆధారాలు ఈ ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాన్ని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
హతమైన ఉగ్రవాదుల నుంచి రెండు పాకిస్థానీ ఓటరు గుర్తింపు కార్డులు లభించాయి. అవి సులేమాన్ షా, అబూ హమ్జా పేరిట ఉన్నాయి. అలాగే, కరాచీలో తయారైన ‘కాండీల్యాండ్’, ‘చోకోమాక్స్’ చాక్లెట్ రేపర్లు కూడా లభ్యమయ్యాయి. దెబ్బతిన్న ఉపగ్రహ ఫోన్‌లో లభించిన మైక్రో-ఎస్డీ కార్డులో పాకిస్థాన్ నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (ఎన్ఏడీఆర్ఏ)కి చెందిన బయోమెట్రిక్ రికార్డులు ఉన్నాయి. వీటిలో వేలిముద్రలు, ముఖ టెంప్లేట్‌లు, కుటుంబ వివరాలు లభించాయి. వీరి నమోదిత చిరునామాలు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని చంగా మాంగా, కోయియాన్ గ్రామాలవిగా గుర్తించారు.
బాలిస్టిక్.. డీఎన్ఏ విశ్లేషణ
పహల్గామ్‌లోని బైసారన్ లోయలో లభించిన 7.62×39 ఎంఎం షెల్ కేసింగ్‌లు, ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మూడు ఏకే -103 రైఫిల్స్‌పై ఉన్న గుర్తులతో ఇవి సరిపోలాయి. ఆరుగురు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంతేకాకుండా, పహల్గామ్‌లో దొరికిన రక్తం నుంచి సేకరించిన డీఎన్ఏ.. హతమైన ఉగ్రవాదుల డీఎన్ఏతో సరిపోలింది.

Leave a Comment

Leave a Comment