జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ( ఆయన తండ్రి మరణ వార్తను సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేశారు. నెల రోజులకు పైగా సోరెన్ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిబు సోరెన్ (81) జూన్ చివరి వారంలో మూత్రపిండాల సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు.ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, గురూజీ మనందరినీ విడిచిపెట్టి వెళ్లారని పేర్కొన్నారు. శిబూ సోరెన్ ఈరోజు ఉదయం 8:56 గంటలకు మరణించినట్లు ప్రకటించారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న సోరెన్‌కు నెలన్నర క్రితం స్ట్రోక్ వచ్చింది. ఆయన దాదాపు నెల రోజులుగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నారు. వైద్యుల బృందం ఐసీయూలో నిరంతరం ఆయనను పర్యవేక్షించింది. కానీ చివరికి ఆయనను కాపాడలేకపోయారు.
