ఒడిశాలోని గజపతి జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో 35 ఏళ్ల వ్యక్తిని గ్రామస్థులు దారుణంగా హత్య చేశారు. గుండు కొట్టి చంపడమే కాకుండా, అతడి జననాంగాలను సైతం కోసివేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ దారుణం మోహనా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలసపదర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుమారు రెండు వారాల క్రితం గ్రామంలో ఒక మహిళ చనిపోయింది. ఈ మరణానికి క్షుద్ర పూజలే కారణమని, ఆ వ్యక్తిపై గ్రామస్థులు అనుమానం పెంచుకున్నారు.
గ్రామస్థుల నుంచి బెదిరింపులు రావడంతో ఆ వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకొని గంజాం జిల్లాలోని అత్తగారింటికి వెళ్లిపోయాడు. ఊళ్లోని తన పశువులను చూసుకోమని వదినను కోరాడు. శనివారం తన పశువులను, మేకలను తీసుకెళ్లడానికి తిరిగి గ్రామానికి రాగా, గ్రామస్థులు అతడిని కిడ్నాప్ చేశారు.
ఆ తర్వాత అతడిని గొంతు పిసికి చంపి, జననాంగాలను కోసివేశారు. అనంతరం శవాన్ని సమీపంలోని హరభంగీ డ్యామ్‌లో పడేశారు. ఆదివారం ఉదయం రిజర్వాయర్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఈ ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన 14 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సురేష్ చంద్ర త్రిపాఠీ తెలిపారు.
