అధికారాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు
2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సందర్భాన్ని శివకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అధికారం నాకు ముఖ్యం కాదు’ అంటూ సోనియా గాంధీ ఒక సిక్కు, అల్పసంఖ్యాకుడైన మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిగా చేశారని ఆయన కొనియాడారు. “ఇంత పెద్ద త్యాగం ఈ ప్రజాస్వామ్యంలో ఇంకెవరైనా చేశారా? ఈ రోజుల్లో కనీసం ఒక చిన్న పంచాయతీ పదవిని కూడా వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు” అని ఆయన వ్యాఖ్యానించారు.
శివకుమార్ ఎవరి పేరునూ నేరుగా చెప్పనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు సిద్ధరామయ్యను ఉద్దేశించి చేసినవే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి అధికార భాగస్వామ్య ఒప్పందం లేదని, ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
