ఓ సెల్ ఫోన్ దొంగతనం ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కదులుతున్న రైలులోంచి కిందపడటంతో అతడి కాలు చక్రాల కింద నలిగిపోయింది. ముంబయి లోకల్ ట్రైన్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే… థానే జిల్లాకు చెందిన గౌరవ్ నికమ్ అనే వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. రద్దీగా ఉండటంతో రైలు డోర్ దగ్గరే నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన ఓ దొంగ, అతడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను ఒక్కసారిగా లాక్కున్నాడు. ఈ హఠాత్పరిణామంతో గౌరవ్ నికమ్ అదుపుతప్పి కదులుతున్న రైలులో నుంచి కిందకు జారిపడ్డాడు. దురదృష్టవశాత్తు అతడి కాలు రైలు పట్టాలపై పడటంతో, రైలు చక్రాలు దానిపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతడి కాలు నుజ్జునుజ్జయింది.
ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గౌరవ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
