టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ తన బ్యాటింగ్‌తో క్రికెట్ ఆటకు కొత్తదనాన్ని అద్దుతున్నాడని, ఆటను పునర్నిర్వచిస్తున్నాడని చాపెల్ కొనియాడాడు. ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పంత్ ప్రదర్శించిన సాహసోపేతమైన ఆటతీరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది.
ఈ మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాది చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే టెస్టు క్రికెట్‌లో భారత వికెట్ కీపర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీని అధిగమించాడు. ఈ అద్భుత ప్రదర్శనపై గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ, పంత్ బ్యాటింగ్ కళకు కొత్త నిర్వచనం ఇస్తున్నాడని పేర్కొన్నాడు.
