భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్, వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయానం విజయవంతంగా కొనసాగుతోంది. యాక్సియం-4 మిషన్లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆయన ప్రస్తుతం భూకక్ష్యలో పరిభ్రమిస్తున్నారు. నేటి సాయంత్రం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS) చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్షం నుంచి ఆయన లైవ్కాల్లో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయాణం అద్భుతంగా ఉందని, భారరహిత స్థితిలో నడవడం వంటివి చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని ఆయన తెలిపారు.భారత కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 12:01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లా సహా మొత్తం నలుగురు వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ వ్యోమనౌక ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. ఈ బృందం అక్కడ 14 రోజుల పాటు ఉండి పలు కీలక పరిశోధనలు చేపట్టనుంది. దాదాపు 41 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
