విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టర్మినల్ ఓ మైలురాయి..పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

Picture of Victory Media Tv

Victory Media Tv

విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టర్మినల్ ఓ మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విశాఖలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం పోర్టులో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ కు వచ్చిన కార్డేలియా సముద్ర విహార నౌకను వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అలలపై ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించే విలాసవంతమైన సముద్ర విహార నౌకను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తద్వారా చెన్నై-విశాఖ-పుదచ్చేరి మధ్య క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా నౌకలో కల్పించిన వసతులను, పర్యాటకులకు అందించే సౌకర్యాలను, ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను మంత్రి దుర్గేష్ సందర్శించారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్, స్పెషల్ లాంజ్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్స్ తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ పోర్టు అథారిటీ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. విశాఖ పోర్టు అథారిటీ అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ ఏర్పాటులో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరి కృషి అభినందనీయమన్నారు.రాష్ట్రంలో వీలైనంత త్వరగా క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే పోర్టు కార్యకలాపాల్లో అగ్రగామిగా ఉన్న విశాఖపట్నం ఇకపై క్రూయిజ్ పర్యాటకులకూ సేవలందించనుందన్నారు. విశాఖపట్నం ప్రకృతి సహజ సిద్ధ అందాలు, సుదీర్ఘ సముద్రతీరం, అందమైన సినీ లొకేషన్లు, చారిత్రక కట్టడాలు తదితర అందాలకు నెలవన్నారు.ఈ క్రమంలో టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేసి విశాఖను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు.క్రూయిజ్ టూరిజం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామన్నారు. 2047 నాటికి ఏపీని ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషిచేస్తామన్నారు. ఈ టెర్మినల్ నిర్మాణంతో విశాఖ ప్రతిష్ఠ మరింత పెరగనుందన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం ల నేతృత్వంలో ఏపీని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అంతేగాక రాష్ట్రంలో ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. గడిచిన ఏడాదిలో టూరిజం రంగంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు విభిన్న పర్యాటక ప్రక్రియలు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకంతో పలువురు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్ర పర్యాటకరంగానికి పారిశ్రామిక హోదా కల్పించినందుకు దేశంలోనే ఏపీని టూరిజం రంగంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖకు సమీపంలోని తూర్పుగోదావరిలో ఎకో, టెంపుల్, వెల్ నెస్, అడ్వెంచర్ తదితర అన్ని రకాల టూరిజం ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయని వైజాగ్ లోనూ ఆ తరహా అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు.

Leave a Comment

Leave a Comment